టీవీకే పార్టీ శాసనసభాపక్ష నేతగా విజయ్ ఏకగ్రీవం

  • తమిళనాడు ఎన్నికల్లో 108 సీట్లు గెలుచుకున్న టీవీకే
  • ప్రభుత్వ ఏర్పాటుకు 10 సీట్ల దూరంలో నిలిచిన విజయ్ పార్టీ
  • సీఎం స్టాలిన్‌ సహా పలువురు రాజకీయ ప్రముఖులను ఓడించిన టీవీకే అభ్యర్థులు
  • రెండు స్థానాల్లోనూ విజయం సాధించిన నటుడు విజయ్
తమిళగ వెట్రి కళగం (టీవీకే) శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత, నటుడు విజయ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. గెలుపొందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇవాళ చెన్నైలోని పనయ్యూర్ పార్టీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ భేటీకి పార్టీ అధినేత విజయ్, జనరల్ సెక్రటరీ ఆధవ్ అర్జునతో పాటు పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ సమావేశం ముగిశాక విజయ్ తన నివాసానికి వెళ్లిపోయారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అద్భుతమైన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి కొత్తగా ప్రవేశించిన ఈ పార్టీ, మొత్తం 234 స్థానాలకు గాను 108 సీట్లను కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మెజారిటీ మార్కుకు మరో 10 సీట్ల దూరంలో నిలిచింది. ఈ నేపథ్యంలో, గెలిచిన అభ్యర్థులతో విజయ్ సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

ఈ ఎన్నికల్లో టీవీకే ధాటికి ఎంకే స్టాలిన్, డీఎంకే సీనియర్ నేత దురైమురుగన్, ఎల్. మురుగన్, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వంటి ఎందరో రాజకీయ ప్రముఖులు ఓటమి పాలయ్యారు. కొళత్తూరులో సీఎం స్టాలిన్‌పై టీవీకే అభ్యర్థి 8,795 ఓట్ల తేడాతో గెలుపొందారు. తిరుచిరాపల్లి ఈస్ట్, పెరంబూర్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన విజయ్, రెండు చోట్లా ఘనవిజయం సాధించి తన ప్రజాకర్షణను నిరూపించుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాల ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి టీవీకే గండికొట్టింది.

Vijay
Tamilaga Vettri Kazhagam
TVK
Tamil Nadu Assembly Elections
MK Stalin
Tamilisai Soundararajan
Kolathur
Tamil Nadu Politics
Dravida party

More Telugu News